ప్రాచీన కాలంలోని గోండి–కోయ భాష పదాల మూలాలను గుర్తించాలి: ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు..
భద్రాచలం, అక్టోబర్ 02: D వినేష్
ప్రాంతాలు వేరైనా ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, మాట్లాడే భాషలో అనేక సారూప్యతలు ఉన్నాయని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. ప్రాచీన కాలం నాటి గోండి–కోయ భాష పదాలు, అక్షరాలు, మూలాలను గుర్తించి భాషను ప్రామాణికీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
శుక్రవారం భద్రాచలం గిరిజన భవన్లో నిర్వహించిన గోండి–కోయ నిఘంటువు వర్క్‌షాప్ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్‌తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. గిరిజన భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన గోండి–కోయ గోత్రాల జెండాకు పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. అనంతరం ఆదివాసీ మహనీయుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు.
గాంధీ జయంతిని పురస్కరించుకొని వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆదివాసీ ప్రతినిధులు, గిరిజనులతో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోండి–కోయ భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో ప్రాచీనమైనవని తెలిపారు. భాషకు అధికారిక గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో గతంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లు, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలను ప్రస్తావించారు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న గోండి–కోయ తెగల ప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి ప్రాచీన భాషా మూలాలు, పదాలు, అక్షరాలను గుర్తించి ప్రామాణికీకరిస్తే భాషకు ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత: పీవో బి. రాహుల్..
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మాట్లాడుతూ కోయ సమాజం భాష, సంస్కృతుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ప్రయత్నం చారిత్రక ప్రాధాన్యత కలిగిందన్నారు. ఆదిమ జాతుల భాషలు, సంస్కృతులకు సరైన గుర్తింపు, గౌరవం లభించకపోతే అవి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
కోయ–గోండ్ సమాజానికి చెందిన ప్రతినిధులు కలిసి భాషను ప్రామాణికీకరించేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. భాషా గుర్తింపును కోరుకునే ప్రతి ఒక్కరూ తమ మాతృభాష కోయలో మాట్లాడాలని, పిల్లలకు కోయ భాష నేర్పించాలని, తమ సంస్కృతిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.
కోయ భాష, సంస్కృతి, చరిత్ర పరిరక్షణకు భద్రాచలం ఐటీడీఏ ఎల్లవేళలా సంపూర్ణ మద్దతు అందిస్తుందని రాహుల్ తెలిపారు. కోయ భాషలో ప్రాథమిక విద్యా కార్యక్రమాలు, ఆదివాసీ దినోత్సవ నిర్వహణ, మ్యూజియం పునరుద్ధరణ, కోయ భాషా దినోత్సవం, కోయ రేల పాటల ఆల్బమ్, కోయ భాషా వర్క్‌షాప్‌లు, కోయ ఇలవేల్పుల పురాణ కథలను గ్రంథస్తం చేయడం వంటి కార్యక్రమాలను ఆయన వివరించారు.
అనంతరం ఆదివాసీ చిన్నారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి. రాహుల్ తదితరులు తిలకించారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, సర్పంచ్ పూనేం కృష్ణదొర, ఏటీడీవో రాధమ్మ, రిటైర్డ్ ఏసీఎంవో రమణయ్య, గోండి–కోయ వర్క్‌షాప్ కన్వీనర్ నెహ్రూ, తొమ్మిది రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 10









