వరంగల్ (మామనూర్) విమానాశ్రయ పునరుద్ధరణ, అభివృద్ధి పనుల్లో అత్యంత కీలకమైన పురోగతి నమోదైంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మొదటి దశ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తి చేసి కాంట్రాక్టు సంస్థను అధికారికంగా ఖరారు చేసింది. ఎయిర్పోర్టు కోసం ప్రభుత్వం కొత్తగా సేకరించిన భూమి చుట్టూ రక్షణ గోడ (బౌండరీ వాల్) నిర్మాణ పనులను హైదరాబాద్కు చెందిన ప్రముఖ సంస్థ ‘సైదాక్స్ ఇంజనీర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ దక్కించుకుంది.
ఈ బౌండరీ వాల్ పనుల కోసం ఏఏఐ తొలుత రూ. 21.39 కోట్లను ఇంజనీరింగ్ అంచనా వ్యయంగా నిర్ణయించింది. అయితే, సైదాక్స్ సంస్థ అంచనా వ్యయం కంటే ఏకంగా 37.89 శాతం తక్కువకు కోట్ చేస్తూ కేవలం రూ. 13.28 కోట్లకే పనులు పూర్తి చేస్తామని బిడ్ దాఖలు చేసి కాంట్రాక్టును కైవసం చేసుకుంది. ఈ భారీ వ్యత్యాసం కారణంగా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 8.10 కోట్ల ప్రజాధనం ఆదా కావడం విశేషం. బేగంపేట విమానాశ్రయంలోని ఏఏఐ కార్యాలయంలో అక్టోబర్ 14 లోపు అధికారిక ఒప్పందంపై సైదాక్స్ ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు.
ఒప్పందం ప్రకారం కొత్తగా సేకరించిన 283 ఎకరాల భూమి చుట్టూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) కఠిన నిబంధనలకు అనుగుణంగా ప్రీకాస్ట్ బౌండరీ వాల్ను నిర్మించడంతో పాటు, పాత ప్రహరీ ఎత్తును పెంచాల్సి ఉంటుంది. అక్టోబర్ 9న ప్రారంభం కానున్న ఈ నిర్మాణ పనులను 15 నెలల గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ. 285 కోట్లతో భూసేకరణను పూర్తి చేసి భూమిని ఏఏఐకి అప్పగించగా.. టెర్మినల్ భవనం, ఏటీసీ (ATC) టవర్ వంటి ఇతర ప్రధాన పనులకు కూడా టెండర్ల కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. 2028 జూన్ నాటికి వరంగల్ ప్రజలకు పూర్తిస్థాయిలో విమాన సేవలను అందుబాటులోకి తేవడమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Post Views: 18









