“మీరు మా ఏపీ ముద్దుబిడ్డ”: అనంత్ అంబానీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న సీఎం చంద్రబాబు.. మదనపల్లెలో రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్!

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన వేదికపై అరుదైన, భావోద్వేగపూరిత ఘట్టం ఆవిష్కృతమైంది. “అనంత్ అంబానీ.. మీరు మా ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ” అంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు. అంతకుముందు వేదికపై ప్రసంగించిన అనంత్ అంబానీ.. “నన్ను ఆంధ్రా బిడ్డగానే భావించండి.. ఈ రాష్ట్ర అభివృద్ధికి నేను ఏం చేయాలో మీరే మార్గనిర్దేశం చేయండి” అంటూ చేసిన ఉద్వేగభరిత ప్రసంగానికి సభా ప్రాంగణంలో ఉన్న వేలాది మంది ప్రజలతో పాటు వేదికపై ఉన్న ప్రముఖులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.

అనంత్ అంబానీ ప్రసంగం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన వద్దకు వెళ్లి ఆప్యాయంగా హత్తుకోగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అనంత్ అంబానీ ఆలోచనలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ సమగ్ర పారిశ్రామిక, వ్యవసాయాభివృద్ధిలో రిలయన్స్ సంస్థ మరింత కీలక భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో రిలయన్స్ భాగస్వామ్యం రాష్ట్రానికి కొండంత అండగా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ (GHH), ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ (ISA) ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనంత్ అంబానీ సంయుక్తంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు రూ.లక్ష కోట్ల భారీ అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో రూ.40 వేల కోట్లు ప్రభుత్వ సహకారంతో, మిగిలిన రూ.60 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడుల ద్వారా సమీకరించనున్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా రాయలసీమ వ్యాప్తంగా అత్యాధునిక సాగు పద్ధతులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రపంచ స్థాయి ఎగుమతుల వ్యవస్థ అందుబాటులోకి వచ్చి రైతుల ఆదాయం గణనీయంగా పెరగనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు