“తల్లికి వందనం రెండో విడతకు రంగం సిద్ధం”: త్వరలో ఖాతాల్లోకి రూ. 13,000.. డబ్బులు పడాలంటే ఈ వివరాలు తప్పనిసరిగా సరిచూసుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లోని పేద విద్యార్థుల తల్లులకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మక ‘తల్లికి వందనం’ పథకం రెండో విడత నిధుల విడుదలకు అధికారులు చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నిధుల మంజూరుకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే పూర్తి స్థాయి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచి తుది గ్రీన్ సిగ్నల్ రాగానే.. ఈ నెల రెండో వారంలోనే అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా రూ. 13,000 జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది.

ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో కొత్తగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులతో పాటు, మొదటి విడతలో అర్హత ఉండి కూడా సాంకేతిక కారణాల వల్ల లబ్ధి పొందని వారికి ఈ రెండో విడతలో అవకాశం కల్పిస్తున్నారు. ప్రధానంగా ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్ కొత్త అడ్మిషన్లు, దరఖాస్తుల్లో మార్పులు-చేర్పుల సమస్యలతో దాదాపు రెండున్నర లక్షల మందికి పైగా విద్యార్థులకు తొలి విడతలో నగదు జమ కాలేదు. వారందరినీ పరిగణనలోకి తీసుకుంటూ ఇప్పటికే అర్హుల తుది జాబితాను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది.

మొదటి విడతలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని, నగదు జమ కావడంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా లబ్ధిదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్థి మరియు తల్లి ఆధార్ నంబర్లు, ఈ-కేవైసీ (e-KYC), బ్యాంక్ ఖాతా వివరాలు, ఐఎఫ్‌ఎస్‌సీ (IFSC) కోడ్ సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండటంతో పాటు, ప్రస్తుతం చదువుతున్న విద్యాసంస్థ వివరాలు రికార్డుల్లో సరిగ్గా నమోదయ్యాయో లేదో పరిశీలించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు