“సాయికృష్ణది ముమ్మాటికీ కస్టడీ హత్యే”: సిట్ ఛార్జిషీట్‌లో సంచలన నిజాలు.. సీఐ నాగరాజు సహా ఏడుగురు పోలీసులపై అభియోగాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) న్యాయస్థానానికి సమర్పించిన ప్రాథమిక ఛార్జిషీట్‌లో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణది సాధారణ మరణం కాదని, పోలీసుల క్రూరమైన చిత్రహింసల వల్లే ప్రాణాలు కోల్పోయాడని సిట్ తన నివేదికలో నిర్ధారించింది. ఈ కస్టడీ హత్య కేసుకు సంబంధించి కృష్ణలంక అప్పటి సీఐ నాగరాజుతో పాటు మరో ఆరుగురు పోలీసు సిబ్బందిని (మొత్తం ఏడుగురు) ప్రధాన నిందితులుగా పేర్కొంటూ 86 పేజీల ప్రాథమిక ఛార్జిషీట్‌తో పాటు 263 కీలక ఆధారాల పత్రాలను కోర్టుకు అందజేసింది.
నివేదిక వివరాల ప్రకారం.. నాన్-బెయిలబుల్ వారెంట్‌పై ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు, అక్కడ అతడిపై అమానుషంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. పోలీసుల తీవ్ర కొట్టుడుకు తట్టుకోలేక ఆరోగ్యం విషమించి సాయికృష్ణ స్టేషన్‌లోనే మరణించాడు. అనంతరం ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు నిందితులు అత్యంత పక్కా పథకం ప్రకారం వ్యవహరించారు. అర్థరాత్రి వేళ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దుప్పటిలో చుట్టి శ్మశానవాటికకు తరలించి, పోస్ట్‌మార్టం కూడా లేకుండా రహస్యంగా దహనం చేసి అంతమొందించినట్లు సిట్ ఆధారాలతో సహా తేల్చింది.
ఈ దారుణాన్ని పూర్తిగా మరుగునపరిచేందుకు నిందితులు వ్యవస్థాగతంగా సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారని సిట్ స్పష్టం చేసింది. నిబంధనలను కాలరాస్తూ లాకప్ డైరీ, జనరల్ డైరీ, సెంట్రీ బుక్‌లలో సాయికృష్ణ అదుపునకు సంబంధించిన ఎలాంటి ఎంట్రీలను నమోదు చేయలేదు. ఆపై స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను ధ్వంసం చేయడమే కాకుండా, రక్తపు మరకలు మరియు నేర ఆనవాళ్లు దొరక్కుండా లాకప్‌ను నీళ్లతో కడిగేసి, రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్‌కు కొత్తగా రంగులు వేయించి సాక్ష్యాలను తుడిచిపెట్టే యత్నం చేశారని సిట్ వెల్లడించింది. సుమారు 120 మంది సాక్షులను విచారించి ఈ విషయాలను నిరూపించామని, ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతోందని ప్రత్యేక బృందం కోర్టుకు నివేదించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు