గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి: రూ.2,052 కోట్లతో ‘అడవితల్లి బాట 2.0’.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు ప్రశంసలు!

ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల్లో దశాబ్దాలుగా నెలకొన్న రాకపోకల కష్టాలను తీర్చి, గిరిజన గ్రామాలకు పక్కా రహదారి సౌకర్యం కల్పించే సంకల్పంతో చేపట్టిన ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రశంసిస్తూ ప్రత్యేక పోస్ట్ చేశారు. తొలి విడత విజయవంతంగా సాగగా, ప్రస్తుతం రెండో దశ అయిన ‘అడవితల్లి బాట 2.0’కు శ్రీకారం చుట్టడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.

ఈ రెండో విడత ప్రాజెక్టు కింద దాదాపు రూ. 2,052 కోట్ల భారీ వ్యయంతో 1,341 గిరిజన ఆవాసాలను కలుపుతూ 1,976 కిలోమీటర్ల మేర పక్కా రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు చంద్రబాబు వివరించారు. కొండ కోనల్లో రోడ్ల నిర్మాణం అంటే అది కేవలం రవాణా సదుపాయం మాత్రమే కాదని.. అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందక ప్రాణాలు కోల్పోయే దుస్థితి నుంచి గిరిజనులకు లభించే గొప్ప భరోసా అని, వారి కష్టాలకు శాశ్వత విముక్తి అని పేర్కొన్నారు. ఏజెన్సీలో గర్భిణులు, రోగులను ఆసుపత్రులకు చేర్చేందుకు పడే డోలీ మోతలను దూరం చేసే ఈ సంకల్పం ఒక మహత్తర యజ్ఞమని ఆయన కొనియాడారు.

రాష్ట్రంలోని ప్రతి మారుమూల గిరిజన గూడెం ప్రధాన రహదారులతో అనుసంధానమై, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయి వరకు చేరేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. అడవిబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారి జీవన ప్రమాణాలు పెంచే దిశగా పవన్ కల్యాణ్ చేస్తున్న ఈ విశేష కృషి మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు