హైదరాబాద్‌లో సరికొత్త పాడ్ టాక్సీ సేవలు: ఐటీ కారిడార్‌లో పీఆర్‌టీ రవాణా.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా 3 మార్గాలకు సీఎం రేవంత్ రెడ్డి ఓకే!

హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులతో సమన్వయం చేస్తూ అంతర్జాతీయ స్థాయి పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (PRT – పాడ్ టాక్సీ) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఐటీ కారిడార్‌లో లీ అసోసియేట్స్ సంస్థ అధ్యయనం చేసిన నాలుగు ప్రతిపాదిత కారిడార్లలో మూడింటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాథమిక ఆమోదం తెలిపారు. రాయదుర్గం–కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ–రాయదుర్గం నాలెడ్జ్ సిటీ, కొండాపూర్–ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మార్గాలకు పచ్చజెండా ఊపగా.. అసెంబ్లీ, లక్డీకాపూల్, సచివాలయం మీదుగా ప్రతిపాదించిన నాలుగో మార్గాన్ని రాణిగంజ్ వరకు విస్తరించే సాధ్యాసాధ్యాలపై సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.

ప్రత్యేక ఎలివేటెడ్ ట్రాక్‌లపై నడిచే చిన్న, స్వయంచాలిత (ఆటోమేటెడ్) వాహనాలే ఈ పీఆర్‌టీ లేదా పాడ్ టాక్సీలు. ఒకేసారి వందల మందిని తీసుకెళ్లే భారీ మెట్రోకు ఇవి ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ, మెట్రో స్టేషన్ల నుంచి ఆఫీసులు, వాణిజ్య సముదాయాలకు చేర్చే చివరి దశ రవాణాకు (లాస్ట్-మైల్ కనెక్టివిటీ) ఇవి కీలకంగా మారనున్నాయి. ఒక్కో కిలోమీటరు నిర్మాణానికి సుమారు రూ. 120 కోట్ల నుంచి రూ. 180 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తుండగా, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఒక్కో కారిడార్‌కు మూడు వేర్వేరు ప్రత్యామ్నాయాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

నిత్యం ట్రాఫిక్ జామ్‌లతో సతమతమయ్యే ఐటీ ఉద్యోగులకు ఈ పాడ్ టాక్సీలు అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సులభతరం కానుంది. పీక్ అవర్స్‌లో సొంత కార్లు, బైక్‌లు, క్యాబ్‌లపై ఆధారపడే ఉద్యోగులు ఈ వ్యవస్థకు మారితే ప్రధాన రహదారులపై వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మెట్రో, బస్సులతో అనుసంధానిస్తూ ఈ ఆధునిక వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేస్తేనే భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలకు సమగ్ర పరిష్కారం దొరుకుతుందని రవాణా రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు