రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ సుమారు నాలుగు నెలల క్రితం ఉపాధి నిమిత్తం ఉక్రెయిన్ వెళ్లగా, అక్కడ జరిగిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో చిక్కుకుని దురదృష్టవశాత్తూ మరణించారు. ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న సుదర్శన్ గౌడ్ భార్య విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే అత్యంత మానవతా దృక్పథంతో స్పందించిన ముఖ్యమంత్రి.. మృతుడి కుటుంబానికి రూ. 6 లక్షల తక్షణ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. సీఎం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి ఈ నిధులను విడుదల చేయడానికి అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు, సుదర్శన్ గౌడ్ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి, వారి స్వగ్రామానికి రప్పించేందుకు విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. విదేశాల్లో ఉపాధి వెతుక్కుంటూ వెళ్లి యుద్ధ ప్రభావానికి అమాయక కార్మికుడు బలికావడంపై స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.









