ఓటీపీలు అడగరు, అనుమానాస్పద లింకులు పంపరు.. కేవలం వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తే చాలు, క్షణాల్లో బ్యాంక్ ఖాతాలోని మొత్తం సొమ్ము మాయమైపోతుంది. సాంకేతికతను వాడుకుంటూ సైబర్ కేటుగాళ్లు పన్నిన ప్రమాదకరమైన ‘ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్’ మోసంపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ముందుగా గుర్తుతెలియని నంబర్ నుంచి “మీ బ్యాంక్ ఖాతా నుంచి ఇంత మొత్తం డెబిట్ అయింది.. ఒకవేళ ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే NO అని రిప్లై ఇవ్వండి” అంటూ సందేశం పంపి ప్రజలను భయాందోళనకు గురిచేస్తారని వివరించారు.
కంగారుపడి బాధితులు ‘NO’ అని రిప్లై ఇచ్చిన మరుక్షణమే, ఆ మెసేజ్‌లో దాగి ఉండే ప్రమాదకర మాల్‌వేర్ స్క్రిప్ట్‌లు యాక్టివేట్ అయి మొబైల్ ఫోన్‌పై హ్యాకర్లకు పూర్తి రిమోట్ యాక్సెస్ కల్పిస్తాయి. దీని ద్వారా ఫోన్‌లోని నెట్ బ్యాంకింగ్ లాగిన్స్, పాస్‌వర్డ్‌లను దొంగిలించి ఖాతాను క్షణాల్లో ఖాళీ చేస్తున్నారు. ఇటీవల ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం ఈ దెబ్బకు భారీగా నష్టపోయినట్లు సజ్జనార్ గుర్తుచేశారు. ఏ అధికారిక బ్యాంకు కూడా వాట్సాప్ ద్వారా ఇలాంటి లావాదేవీల ధ్రువీకరణ కోరదని, అనుమానాస్పద మెసేజ్‌లకు ‘YES’ లేదా ‘NO’ అని ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెంటనే ఆ నంబర్లను బ్లాక్ చేసి చాట్‌ను డిలీట్ చేయాలని ఆయన సూచించారు.
ఖాతాలో డబ్బు కట్ అయిందో లేదో తెలుసుకోవడానికి కేవలం అధికారిక బ్యాంక్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెక్ చేసుకోవాలని, వాట్సాప్ మెసేజ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా దురదృష్టవశాత్తూ ఈ సైబర్ మోసం బారిన పడితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘గోల్డెన్ అవర్’లో స్పందించాలని పిలుపునిచ్చారు. తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ ‘1930’కి కాల్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే, బ్యాంక్ ఖాతాల నుంచి దొంగిలించిన సొమ్మును నిలిపివేసి రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సజ్జనార్ ప్రజలకు అవగాహన కల్పించారు.
Post Views: 3









