తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటూ అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా అలైన్మెంట్ కూడా ఖరారు చేయని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరు చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా భూసేకరణ చేపట్టడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఆమె ధ్వజమెత్తారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా రూట్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదని ప్రకటించిన నేపథ్యంలో, బహదూర్‌గూడలో పోలీసుల పహారా నడుమ రైతుల భూములను ఏ ప్రాతిపదికన బలవంతంగా లాక్కున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం అనవసరంగా సేకరిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డికి ఇంత భూదాహం ఎందుకని సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు సాగునీరు, తాగునీరు, నిరంతర విద్యుత్ వంటి కనీస వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులను పంటలు వేయవద్దని ఉచిత సలహాలు ఇవ్వడం సిగ్గుచేటని, ఉన్న మెట్రో టెండర్లను రద్దు చేసిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ల పేరుతో వేల ఎకరాల వ్యవసాయ భూములను గుంజుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
కొత్వాల్‌గూడ నుంచి కొడంగల్‌కు అనవసరంగా కొత్త రహదారిని ఎందుకు నిర్మిస్తున్నారో స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విలువైన భూములను అమ్మి పరిపాలన సాగించాలనే దురాలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉందని, మరోవైపు నాదర్‌గూల్‌లో విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. భూసేకరణ పేరిట ప్రభుత్వం పెడుతున్న తీవ్ర మానసిక ఒత్తిడి తట్టుకోలేక కొడంగల్ నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇప్పటికైనా రైతు వ్యతిరేక విధానాలు, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.
Post Views: 3









