ఇది వ్యూహాత్మక మౌనమా.. మ్యాచ్ ఫిక్సింగా.?!

తెలంగాణ రాజకీయ రంగస్థలం ప్రస్తుతం సరికొత్త సమీకరణాలతో, అనూహ్య మలుపులతో వేడెక్కుతోంది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో తిరిగి పట్టు సాధించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతుంటే, రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ మాత్రం ఆచితూచి అడుగులేస్తున్న వైఖరి రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో వ్యవసాయానికి, గృహావసరాలకు సరైన విద్యుత్ అందక తలెత్తుతున్న సమస్యలు, రికార్డు స్థాయి విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ శ్రేణులు సబ్‌స్టేషన్ల ముట్టడికి దిగుతూ క్షేత్రస్థాయిలో నిరసన జ్వాలలు రగిలిస్తున్నాయి. మరోవైపు రైతు రుణమాఫీ అసంపూర్తి అమలు, రైతు భరోసా చెల్లింపుల్లో జాప్యం, మూసీ ప్రాజెక్ట్ పేరిట సాగుతున్న కూల్చివేతలతో పాటు పరిపాలనాపరమైన అవినీతిపై బీఆర్ఎస్ స్వరం పెంచింది.
ఇది ఇలా ఉంటే ముఖ్యంగా అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి బావమరిదికి లబ్ధి చేకూరిందన్న అంశంతో పాటు, తాజాగా మెడికవర్ హాస్పిటల్‌లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, అల్లుడి వ్యాపార ప్రయోజనాలు, వేల కోట్ల విక్రయాల ముసుగులో జరుగుతున్న అక్రమాలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నారు. కేటీఆర్, హరీశ్ రావు వంటి అగ్రనేతలు నిత్యం ప్రజల్లో ఉంటూ, ఢిల్లీ స్థాయికి ఫిర్యాదులను తీసుకెళ్తూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలను, రైతులను నేరుగా తాకే విద్యుత్ సంక్షోభంపై కానీ, ప్రభుత్వం మెడలు వంచేలా ఉన్న మెడికవర్ ఆసుపత్రి అక్రమాలపై కానీ బీజేపీ మాత్రం ఆశించిన స్థాయిలో గళమెత్తకపోవడం ప్రజల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ విచిత్ర మౌనం వెనుక రేవంత్ రెడ్డి సర్కార్‌తో రాష్ట్ర బీజేపీ నాయకత్వం లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా కొన్ని తెరవెనుక పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఘర్షణాత్మక వైఖరిని ప్రదర్శించగా, రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక కేంద్ర పెద్దలతో, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీతో ‘బడే భాయ్’ అంటూ సత్సంబంధాలు నెరపుతుండటం, ఢిల్లీ పర్యటనల్లో పరస్పర సౌహార్ద్రత ప్రదర్శించడం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికితోడు, గతంలో రేవంత్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలోనూ, ఉమ్మడి విద్యార్థి రాజకీయాల్లోనూ పనిచేసిన పలువురు నేతలు నేడు రాష్ట్ర బీజేపీలో చక్రం తిప్పుతున్నారు. ఆ పాత రాజకీయ సాన్నిహిత్యాలు, వ్యక్తిగత, వ్యాపార సంబంధాలే రేవంత్‌పై దాడిని మృదువుగా మారుస్తున్నాయనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విద్యుత్ కోతలు, హాస్పిటల్ వ్యవహారాల వంటి కీలక సమయాల్లో సైతం కాషాయ నేతలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న భావన క్షేత్రస్థాయి కార్యకర్తల్లో కూడా తీవ్ర అసంతృప్తిని రగిలిస్తోంది.
ఇది ఇలా ఉంటే , బీజేపీ పూర్తిగా చేష్టలుడిగి చూస్తోందనడం కూడా వాస్తవానికి దూరమే అవుతుంది. రేవంత్ రెడ్డి బంధువుల అమృత్ టెండర్ల వ్యవహారాన్ని పత్రాలతో సహా తొలుత బయటపెట్టి కేంద్రానికి ఫిర్యాదు చేసింది బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాగా, మూసీ పరివాహక ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాత్రి బస చేయడం, ఎంపీ ఈటల రాజేందర్ నివాసాల కూల్చివేతలను అడ్డుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికీ, ఈ అంశాలను కానీ లేదా రోజువారీ విద్యుత్ ఇబ్బందులను కాగా క్షేత్రస్థాయిలో ఉధృతమైన ప్రజా ఉద్యమంగా మలచడంలో బీజేపీ విఫలమైంది. నేతల మధ్య ఉన్న అంతర్గత సమన్వయ లోపం, ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే గ్రూపు విభేదాలు పార్టీ గొంతును బలహీనపరిచాయి. ఫలితంగా బీజేపీ విమర్శలు మీడియా సమావేశాలకే పరిమితమవుతూ, బీఆర్ఎస్ దూకుడు ముందు తేలిపోతున్నాయి.
ఈ మందకొడి పోరాటం వెనుక బీజేపీకి నిర్దిష్టమైన దీర్ఘకాలిక రాజకీయ లెక్కలు దాగి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యుత్ కొరత, పాలనా లోపాల పేరిట తీవ్ర ప్రజా వ్యతిరేకతను రగిలిస్తే, తక్షణ లబ్ధిదారుగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అవతరిస్తుందన్నది బీజేపీ అగ్రనాయకత్వ భయం. బీఆర్ఎస్ మళ్లీ క్షేత్రస్థాయిలో పుంజుకుంటే, రాష్ట్ర రాజకీయం తిరిగి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా మారి బీజేపీ మూడో స్థానానికి పరిమితమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల బీఆర్ఎస్ రాజకీయంగా మరింత క్షీణించే వరకు వేచి చూసి, ఆ ప్రతిపక్ష శూన్యతను తాము ఆక్రమించాకే కాంగ్రెస్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించాలన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే వ్యవసాయ, విద్యుత్ సంక్షోభాలు, ఆసుపత్రుల అక్రమాల వంటి నిత్య ప్రజా సమస్యల కంటే… తమకు రాజకీయంగా అనుకూలించే భావోద్వేగ, సామాజిక అంశాల చుట్టూనే రాజకీయాలను తిప్పాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
మరోవైపు తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం విచిత్రమైన పరస్పర కుమ్మక్కు ఆరోపణల క్రీడగా మారాయి. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై ప్రాంతీయ అస్తిత్వాన్ని, బీఆర్ఎస్‌ను సమాధి చేయాలని చూస్తున్నాయని గులాబీ దళం ప్రచారం చేస్తుంటే.. ఢిల్లీ లిక్కర్ కేసు పరిణామాలు, గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు వేగం పెంచకపోవడాన్ని చూపుతూ బీజేపీ-బీఆర్ఎస్ మధ్యే రహస్య బంధం ఉందని అధికార కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ, అవినీతి పార్టీలేనంటూ బీజేపీ మరో కొత్త వాదనను వినిపిస్తోంది.
ఈ రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తుగడలు ఎలా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం వల్ల అంతిమంగా అధికార పక్షానికే రక్షణ కవచం లభిస్తోంది. విద్యుత్ సమస్యలతో సతమతమవుతున్న రైతులు, కార్పొరేట్ దోపిడీకి గురవుతున్న సామాన్యుల పక్షాన నిలబడాల్సిన సమయంలో.. ప్రతిపక్షాలు తమ స్వార్థ రాజకీయ మనుగడ లెక్కల్లో మునిగిపోవడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. రేవంత్ సర్కార్‌పై బీజేపీ ప్రదర్శిస్తున్న ‘వ్యూహాత్మక నిదానం’ ఆ పార్టీకి భవిష్యత్తులో రాజకీయ లబ్ధి చేకూరుస్తుందో లేక ప్రజల్లో ప్రత్యామ్నాయ విశ్వసనీయతనే పూర్తిగా దెబ్బతీస్తుందో రానున్న కాలమే నిర్ణయిస్తుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు