భారతదేశంలో చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ ద్వారా ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 13 కోట్ల మంది (130 మిలియన్లు) ఓటర్ల పేర్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన భారత్లో ఇంత భారీ స్థాయిలో పేర్లను తొలగించడాన్ని ఆమె ముమ్మాటికీ “ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రయత్నం”గా అభివర్ణించారు.
అమెరికాలో ఓటర్ల హక్కులను అణచివేసేందుకు గతంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం అనుసరించిన పద్ధతుల తరహాలోనే ప్రస్తుత భారత పరిణామాలు ఉన్నాయని ప్రమీలా జయపాల్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు హక్కు ప్రాథమిక పునాది అని స్పష్టం చేసిన ఆమె, ఈ ఓట్ల తొలగింపు చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఎవరూ హర్షించబోరని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఢిల్లీ, ముంబై సహా దేశవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియకు వ్యతిరేకంగా జరుగుతున్న శాంతియుత నిరసనలకు ఆమె తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
భారత్లో ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని విపక్షాలు దేశవ్యాప్త ఆందోళనలు తీవ్రతరం చేసిన తరుణంలో, అమెరికా ప్రజాప్రతినిధి ప్రమీలా జయపాల్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.








