ఎస్ఐఆర్ వివాదం వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం: 17 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఆదేశం.. నవంబర్ 12న ముసాయిదా విడుదల!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం, అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగింపునకు గురైన అర్హులను తిరిగి జాబితాలోకి తీసుకురావడమే లక్ష్యంగా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక చేర్పుల సవరణ (SSR) ప్రక్రియకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సవరణ పరిధిలో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, తమిళనాడు తదితర కీలక రాష్ట్రాలు ఉన్నాయి. అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు 2027 జనవరి 1ని ప్రామాణిక గడువు తేదీగా నిర్ణయించిన ఈసీ, నవంబర్ 12న ముసాయిదా జాబితాను, 2027 జనవరి 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు స్పష్టం చేసింది.

ఎస్ఐఆర్ ప్రక్రియలో లక్షలాది ఓట్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారని, దరఖాస్తుదారులు 20 ఏళ్ల క్రితం నాటి తమ తల్లిదండ్రుల ఎస్ఐఆర్ వివరాలను జతచేయాలనే అదనపు డిక్లరేషన్ నిబంధన అన్యాయమని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి, కాక్రోచ్ జనతా పార్టీ (CJP)లు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే, తాజా SSR ఉత్తర్వుల్లో సాధారణ ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంటూ, వివాదాస్పద అదనపు డిక్లరేషన్ ప్రస్తావనను ఈసీ పక్కన పెట్టింది. ఆ డిక్లరేషన్ కేవలం ఎస్ఐఆర్ కొనసాగుతున్న రాష్ట్రాలకు మాత్రమే పరిమితమని, సాధారణ సమయాల్లో ‘ఓటర్ల నమోదు నిబంధనలు, 1960’ ప్రకారమే ప్రక్రియ సాగుతుందని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.

అదే సమయంలో ఓట్ల తొలగింపులో అక్రమాలను అడ్డుకునేందుకు ఈసీ కఠిన నిబంధనలను నిర్దేశించింది. మొత్తం ఓటర్లలో 2 శాతానికి పైగా పేర్లను తొలగించాల్సి వచ్చినప్పుడు లేదా ఒకే వ్యక్తి 5 కంటే ఎక్కువ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROs) స్వయంగా వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించింది. శాశ్వతంగా వలస వెళ్లిన లేదా మరణించిన వారి పేర్లను కేవలం ఫారమ్-7 ఆధారంగానే, సంబంధిత వ్యక్తి వాదన విన్న తర్వాతే రాతపూర్వక ఉత్తర్వులతో తొలగించి ECINETలో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే ఎస్ఐఆర్ పూర్తయిన లేదా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు తదుపరి షెడ్యూల్‌ను ప్రత్యేకంగా ప్రకటిస్తామని ఈసీ వెల్లడించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు