దక్షిణ భారతదేశంలో తీవ్ర జల సంక్షోభం… ఫిబ్రవరి వరకు ఎల్‌నినో ప్రభావం! ఏపీ, తెలంగాణకు పెరుగుతున్న నీటి కష్టాలు!

దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో పడిపోతున్న నీటి నిల్వలు..

కేంద్ర జల సంఘం (CWC) నివేదికలో ఆందోళనకర గణాంకాలు!

దేశంలోని 178 ప్రధాన రిజర్వాయర్ల మొత్తం లైవ్ స్టోరేజీ సామర్థ్యం 184.8 BCM కాగా, ప్రస్తుతం 126.7 BCM నీరు మాత్రమే ఉంది… అయితే మొత్తం నిల్వలు 68.6% గా ఉండటం ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి.గత ఏడాది ఇదే సమయంలో 167.9 BCM నీరు ఉండగా, ప్రస్తుతం 41.2 BCM (సుమారు 1,455 TMC) తగ్గింది.

దక్షిణ భారతదేశంలో పరిస్థితి మరింత తీవ్రం!

దక్షిణాది 50 ప్రధాన రిజర్వాయర్ల మొత్తం సామర్థ్యం 55.9 బీసీమ్ కాగా . ప్రస్తుతం నిల్వలు 24.8 BCM మాత్రమే ఉంది . అంటే కేవలం 44.3 శాతమే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే గత ఏడాది 50.1 BCM ఉండగా, ఈ ఏడాది 25.3 BCM (సుమారు 893 TMC) తగ్గింది.
తెలంగాణలో సింగూరు రిజర్వాయర్‌లోనూ నిల్వలు తక్కువగా ఉన్నాయి. మంజీరా, సింగూరు ప్రాజెక్టుల్లో నీటి లభ్యతను పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సమీక్షించారు. మరోవైపు ఎల్‌నినో (El Niño) ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు తీవ్రంగా కొనసాగే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హెచ్చరించారు.

ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీల పెరుగుదల! 

తెలంగాణలో నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం కనిపించిందని, సాధారణం కంటే ఉష్ణోగ్రతలు 2–3°C అధికంగా నమోదయ్యాయని ప్రధాన కార్యదర్శి తెలిపారు.భూగర్భజలాలు గణనీయంగా పడిపోవడంతో రాబోయే 15–20 రోజులు అత్యంత కీలకమని హెచ్చరించారు.

హైదరాబాద్ లో తాగునీటికి ప్రత్యేక చర్యలు!

హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌కు అదనంగా రోజుకు 60 మిలియన్ గ్యాలన్ల (60 MGD) నీటిని సరఫరా చేసే ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ తాగునీటికి ప్రధాన వనరులైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, మంజీరా, కృష్ణా, గోదావరి జలాల లభ్యతను సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది.వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా, పంటల రక్షణకు క్షేత్రస్థాయి సూచనలు, తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇక ఈశాన్య రుతుపవనాలే ఆశాకిరణం!

అక్టోబర్ 15న ప్రారంభమైన ఈశాన్య రుతుపవనాల వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. అయితే ఈ వర్షాలు తగ్గుతున్న రిజర్వాయర్ నిల్వలను ఎంతవరకు పునరుద్ధరిస్తాయన్నది కీలకం. ఒకవైపు వర్షాభావం… మరోవైపు పడిపోతున్న భూగర్భజలాలు… ఫిబ్రవరి వరకు ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుందన్న హెచ్చరికలతో అయోమయ స్థితి నెలకొంది.ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సాగునీరు, తాగునీటి అవసరాల కోసం ముందస్తు జల నిర్వహణ ప్రణాళికలు రూపొందించడం అత్యవసరం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు