తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు: మరో పది రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

భానుడి భగభగలతో, తీవ్రమైన వడగాల్పులతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రానున్న పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. జూన్ 10 నుంచి 12వ తేదీల మధ్య ఇవి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది. దీంతో ఎండల తీవ్రత క్రమంగా తగ్గి, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ప్రారంభం కానున్నాయి.

ప్రస్తుతం కేరళ, దాని పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఈ రుతుపవనాలు.. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా వేగంగా ముందుకు కదులుతున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లో ఇవి తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు తెలిపారు. లక్షద్వీప్ నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన గాలులు చురుగ్గా సాగుతున్నాయి.

రుతుపవనాల రాకతో జూన్ మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. శనివారం ఆసిఫాబాద్ జిల్లా దేహాగాన్‌లో గరిష్టంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ, జూన్ 1 నుంచి హైదరాబాద్‌లో 36-38 డిగ్రీలకు, ఇతర జిల్లాల్లో 40-42 డిగ్రీలకు పగటి ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. కాగా, ముందస్తు ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు