టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య తన వ్యక్తిగత హక్కుల (పర్సనాలిటీ రైట్స్) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నటి సమంత రుత్ ప్రభుతో తన గత వైవాహిక బంధాన్ని ఉద్దేశించి కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు చేస్తున్న అసత్య ప్రచారాలకు, ఆన్‌లైన్ వేధింపులకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం.. నాగచైతన్య ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆయన పేరు, ఫొటోలు, వీడియోలను వాడొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు పలు వెబ్‌సైట్లకు నోటీసులు పంపింది.
కోర్టులో నాగచైతన్య తరఫున సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్ బలమైన వాదనలు వినిపించారు. కొన్ని ఆన్‌లైన్ మాధ్యమాలు సమంతను చైతన్య మోసం చేశారని, ఆమె కెరీర్‌ను నాశనం చేశారంటూ ఎలాంటి ఆధారాలు లేని కథనాలను ప్రచురిస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది ఆరోగ్యకరమైన విమర్శ కాదని, కచ్చితంగా వ్యక్తిగత వేధింపులు, డిజిటల్ ట్రోలింగ్ కిందికే వస్తుందని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, నటుడి ప్రతిష్ఠను కించపరిచేలా ఉన్న కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
నాగచైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకుని, నాలుగేళ్ల తర్వాత 2021 అక్టోబర్‌లో పరస్పర అంగీకారంతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగి కొత్త భాగస్వాములతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నాగచైతన్య 2024 డిసెంబర్‌లో నటి శోభితా ధూళిపాళ్లను, సమంత 2025 డిసెంబర్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకుని స్థిరపడ్డారు. ఇలా ఇద్దరూ కొత్త జీవితాలను ప్రారంభించినప్పటికీ, కొందరు పాత విషయాలనే పదేపదే ప్రస్తావిస్తూ ఆన్‌లైన్‌లో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతుండటంతో నాగచైతన్య ఈ చట్టపరమైన చర్యలకు పూనుకున్నారు.









