పవన్‌ కల్యాణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు కౌంటర్: తెలంగాణ మా అయ్యా జాగీరే!

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జనసేన పార్టీ నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’ వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యంత ఘాటుగా స్పందించారు. పవన్ మాటల్లో తీవ్ర అహంకారం కనిపిస్తోందని మండిపడ్డారు. “అవును.. తెలంగాణ మా తాతల, మా అయ్యా జాగీరే.. ఇక్కడి నాలుగు కోట్ల మంది ప్రజల జాగీరు. సొంత రాష్ట్రమైన ఆంధ్రాలోనే సరిగ్గా గెలవలేకపోయిన నువ్వు ఇక్కడికి వచ్చి ఏం పీకుతావు?” అంటూ తీవ్ర పదజాలంతో నిలదీశారు.

పవన్ కల్యాణ్‌ను ఒక ‘పెయిడ్ ఆర్టిస్ట్’గా అభివర్ణించిన మంత్రి పొన్నం, ఆయన ప్రెస్‌మీట్లలో బీజేపీ లేదా బీఆర్ఎస్ ఇచ్చిన అసంపూర్ణ స్క్రిప్ట్‌లను చదువుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరు రాష్ట్రాల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తుంటే, పవన్ వచ్చి ప్రాంతీయ విద్వేషాలు రగిల్చేలా గెలుకుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు రావడానికి ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే వచ్చి నవనిర్మాణ సభల పేరుతో నాటకాలు ఆడటం సరికాదని హితవు పలికారు. రాజకీయాలు చేయాలనుకుంటే గుజరాత్‌కు వెళ్లి పార్టీ పెట్టుకోవాలని, తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాల గురించి పవన్ మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని, అలాగే ప్రజా గాయకుడు గద్దర్ గురించి మాట్లాడిన తీరుకు పవన్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. తెలంగాణ ఎప్పుడూ ఆంధ్రా ప్రజలను గౌరవిస్తుందని, హైదరాబాద్ అందరిదన్న ఆయన, రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. “ఆంధ్రాలో డిప్యూటీ సీఎంగా ఉండి అక్కడ కూట్లో రాయి తీయలేనోడు.. ఇక్కడికి వచ్చి ఏట్లో రాయి తీస్తాననడం హాస్యాస్పదం” అంటూ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు