భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ విజయవాడలోని లోక్ భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లోక్ భవన్‌కు విచ్చేసిన సీఎం దంపతులకు గవర్నర్ దంపతులు సాదర స్వాగతం పలికి, పరస్పరం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అనంతరం గవర్నర్ ఏర్పాటు చేసిన తేనీటి విందులో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సైనిక అధికారులు మరియు వివిధ రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వయంగా అతిథుల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖుల కలయికతో లోక్ భవన్ ప్రాంగణం ఆహ్లాదకరమైన వాతావరణంలో సందడిగా మారింది.
మరోవైపు, తీవ్ర జ్వరం మరియు అనారోగ్యం కారణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాకినాడలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారని, రాజమండ్రిలో ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లారని ప్రకటనలో పేర్కొన్నారు.









