స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆరెస్సెస్ ఎలాంటి పాత్ర పోషించిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. దేశ విముక్తి కోసం ప్రాణాలర్పించిన 500 మంది కాంగ్రెస్ నేతల పేర్లను తాను ఆధారాలతో సహా చెప్పగలనని, ఆరెస్సెస్ నుంచి కనీసం 50 మంది త్యాగధనుల పేర్లనైనా చూపించగలరా అని సవాల్ విసిరారు. అంతేకాకుండా, దేశ విభజన తర్వాతి కాలంలో తలెత్తిన మత కలహాలకు ఆరెస్సెసే కారణమని ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాల వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని తీసుకువస్తోందని ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రభుత్వ స్థలాల్లో నిర్వహించే ఆరెస్సెస్ శాఖలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. తాము ఏ ఒక్క సంస్థనూ లక్ష్యంగా చేసుకోలేదని, సుప్రీంకోర్టు, హైకోర్టుల మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సంస్థాగత కార్యకలాపాలు నిర్వహించాలనుకునే వారు సొంత ప్రాంగణాల్లో చేసుకోవాలని హితవు పలికారు.
ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ ఘాటుగా స్పందించారు. కోట్ల మంది ప్రజల విశ్వాసంతో నడిచే ఆరెస్సెస్‌కు ఎలాంటి అధికారిక రిజిస్ట్రేషన్ అవసరం లేదని తేల్చిచెప్పారు. దేశ విభజన సమయంలో లక్షలాది మంది హిందువులకు ఆరెస్సెస్ అండగా నిలిచి రక్షణ కల్పించిందని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్ర్యం కేవలం ఉప్పు సత్యాగ్రహం, చరఖాలతో మాత్రమే రాలేదని, ఎందరో విప్లవ వీరులు, దేశభక్తుల ప్రాణత్యాగాల ఫలితంగానే సిద్ధించిందని ఆయన పేర్కొన్నారు.









