టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం గాంధీ భవన్‌లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఈరవత్రి అనిల్, మెట్టు సాయికుమార్ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో అరవింద్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటి దురుసు తగ్గించుకోకపోతే ఇంటికి వచ్చి మరీ ఉరికించి కొడతామని ఘాటుగా హెచ్చరించారు.
ఎన్‌ఎస్‌యూఐ స్థాయి నుంచి స్వయంకృషితో ఎదిగిన బీసీ నాయకుడు మహేశ్ గౌడ్‌ను విమర్శించే నైతిక హక్కు తండ్రి పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్‌కు లేదని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. నిజామాబాద్ ప్రజలకు ఇచ్చిన పసుపు బోర్డు హామీ ఎక్కడికి పోయిందో, గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఏం చేశారో ముందు సమాధానం చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందిస్తుంటే, అరవింద్ కేవలం పనికిరాని ఆరోపణలకే పరిమితమయ్యారని విమర్శించారు.
దమ్ముంటే అరవింద్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచి చూపించాలని కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ సవాల్ విసిరారు. మరోసారి కాంగ్రెస్ నాయకులపై హద్దు మీరి మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తమ ఎంపీలను అదుపులో ఉంచుకోవాలని, లేనిపక్షంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా తిప్పికొడతాయని స్పష్టం చేశారు.








