హైదరాబాద్‌లోని ‘కోడి చెరువు’ను జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కబ్జా చేశారంటూ వస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలిలో నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, ఆయన తన హైదరాబాద్ నివాసంలోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ సవాల్ మరియు ఓపెన్ ఆఫర్ విసిరారు.
తాను కోడి చెరువును ఆక్రమించినట్లు వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, ఒకవేళ తన వల్ల కబ్జా జరిగినట్లు నిరూపిస్తే ఆ భూమిని ఇప్పుడే, తక్షణమే ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. “నా వల్ల కబ్జా జరిగి ఉంటే ఆ ప్రాపర్టీని వెంటనే సీజ్ చేయండి, మీ తాటాకు చప్పుళ్లకు నేను భయపడేవాడిని కాదు” అని ఆయన అన్నారు. అయితే, ప్రభుత్వ ముసుగులో ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా తన ప్రైవేట్ స్థలాల్లోకి అక్రమంగా చొరబడితే మాత్రం చట్టపరమైన కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ప్రతి చిన్న విషయానికి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చి విద్వేషాలు రగిలిస్తే భారతదేశ మనుగడే కష్టమవుతుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం మొదట గొంతు లేపింది జనసేన పార్టీయేనని, దాడులు, కేసులు, బెదిరింపులు తనకు కొత్తేమీ కాదని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అలాగే, విమర్శకులకు గట్టి కౌంటర్ ఇస్తూ తెలంగాణలో జనసేన ఉనికి ఎప్పటికీ ఉంటుందని, రాబోయే జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని ఆయన సంచలన ప్రకటన చేశారు.









