తెలంగాణ, దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ షిపోకోసా పౌలస్ మషాటిలే నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో ఇరుపక్షాల మధ్య రాష్ట్రంలో పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ కూడా పాల్గొన్నారు.
సమాచార సాంకేతికత (ఐటీ), ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, విద్య, నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజం వంటి కీలక రంగాలలో పరస్పర సహకారం పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి. హైదరాబాద్ నగరం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) ప్రధాన కేంద్రంగా మారిందని, ఇక్కడ ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే దక్షిణాఫ్రికా కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున పూర్తి మద్దతు, సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య చారిత్రక బంధం ఉందని ఈ సందర్భంగా డిప్యూటీ ప్రెసిడెంట్ మషాటిలే గుర్తుచేశారు. ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా ద్వారా తెలంగాణ కంపెనీలకు విస్తృత మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, ముఖ్యంగా ఫార్మా రంగంలో స్థానిక ఉత్పత్తి భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తామని ఆయన వెల్లడించారు. కాగా, ఈ ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించబోయే ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు దక్షిణాఫ్రికా ప్రతినిధి బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ఆహ్వానించారు.









