ఫిలిప్పీన్స్‌లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించి పెను విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఉదయం కేవలం ఒక గంట వ్యవధిలోనే మూడుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా ఇప్పటివరకు కనీసం 12 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవనాలు, షాపింగ్ మాల్స్ పేకమేడల్లా కూలిపోతున్న భయంకరమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భూకంప తీవ్రతకు సంబంధించిన వీడియోలు చూసేవారిని వణికేలా చేస్తున్నాయి. జనరల్ శాంటోస్ నగరంలోని ‘ఐరీనియో నేషనల్ హైవే స్కూల్’లో భూ ప్రకంపనలు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భయంతో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నేలపై కూర్చుండిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. అదే నగరంలో ఒక భారీ భవనం కుప్పకూలడంతో దట్టమైన ధూళి ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. మరో వీడియోలో అక్కడి ప్రసిద్ధ ‘జాలిబీ’ బిల్డింగ్ పూర్తిగా శిథిలాలుగా మారడం కనిపించింది. అలాగే మిండానావో ప్రాంతంలో 6.7 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత స్థానిక మాల్స్‌లో గందరగోళం నెలకొంది.
ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. భూకంపం తర్వాత కూడా మరిన్ని ప్యాసింగ్ ప్రకంపనలు (ఆఫ్టర్ షాక్స్) వచ్చే అవకాశం ఉందని ఫిలిప్పీన్స్ భూకంప, అగ్నిపర్వత శాస్త్ర సంస్థ హెచ్చరించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అధికారుల సూచనలను పాటించాలని స్పష్టం చేసింది.









