భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు ఒక భారీ శుభవార్త చెప్పింది. రైలు టికెట్ల బుకింగ్ విధానంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎదురవుతున్న సర్వర్ సమస్యలు, ఇతర ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. రాబోయే ఆగస్టు నెల నుంచి సరికొత్త ‘ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్’ (Passenger Reservation System) విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దాదాపు 1986 నుంచి అంటే గత 40 ఏళ్లుగా వాడుకలో ఉన్న పాత సాంకేతిక విధానాన్ని ఈ సరికొత్త అధునాతన వ్యవస్థతో రైల్వే శాఖ పూర్తిగా మార్చేయనుంది.
ఈ సరికొత్త అప్‌గ్రేడ్ వల్ల ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. దీనివల్ల ప్రయాణికులు నిమిషాల వ్యవధిలోనే లక్షలాది టికెట్లను ఎలాంటి సాంకేతిక అంతరాయాలు లేకుండా, వేగంగా బుక్ చేసుకోవచ్చు. రైల్వే శాఖ 2002లో ఇంటర్నెట్ ఆధారిత టికెట్ బుకింగ్‌ను ప్రారంభించగా, ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న మొత్తం రైల్వే టికెట్లలో దాదాపు 88 శాతం బుకింగ్స్ కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే జరుగుతున్నాయి. ఈ భారీ డిమాండ్‌కు అనుగుణంగానే పాత వ్యవస్థను మారుస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కొత్త సిస్టమ్‌కు మారే ప్రక్రియపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలోని రైల్ భవన్‌లో ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
‘రైల్ వన్’ యాప్ సరికొత్త రికార్డు.. ఏఐ టూల్‌తో వెయిటింగ్ లిస్ట్ కచ్చితత్వం!
రైల్వే శాఖ డిజిటల్ విప్లవంలో భాగంగా గతేడాది జులైలో ప్రారంభించిన ‘రైల్ వన్’ యాప్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం ఏడాది లోపే ఈ యాప్ 3.5 కోట్ల డౌన్‌లోడ్లను దాటేసింది. ఈ ఒక్క యాప్ ద్వారానే టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, రైలు లైవ్ స్టేటస్, ప్లాట్‌ఫామ్ సమాచారం, ఫిర్యాదుల నమోదు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా రోజూ సుమారు 9.29 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయి.
దీనితో పాటు ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వెయిటింగ్ లిస్ట్ టూల్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతోంది. మనం బుక్ చేసుకున్న వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే అవకాశాలను ఈ టూల్ ముందుగానే అంచనా వేస్తుంది. దీని అంచనా కచ్చితత్వం గతంలో 53 శాతంగా ఉండగా.. ఇప్పుడు ఏకంగా 94 శాతానికి పెరిగింది. దీనివల్ల ప్రయాణికులు తమ ప్రయాణ ప్లాన్లను మరింత సులభంగా, కచ్చితత్వంతో మార్చుకునే అవకాశం లభిస్తోంది.









