కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) 12వ తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియలో ఒక కీలకమైన భద్రతాపరమైన నిర్ణయం తీసుకుంది. ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలో ఎదురవుతున్న సాంకేతిక లోపాలు, గందరగోళాన్ని నివారించేందుకు మరియు విద్యార్థుల డేటా భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి డేటాను ‘కోఎంప్ట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ (Coempt Edutek) సంస్థ సర్వర్ల నుండి సీబీఎస్‌ఈ తన సొంత అధికారిక సర్వర్లలోకి మార్చేసింది. ఈ విషయాన్ని ఐఐటీ నిపుణుల కమిటీ సభ్యుడొకరు అధికారికంగా ధృవీకరించారు.
ఈ ఏడాది బోర్డు ఫలితాల తర్వాత ఈ ప్రైవేట్ సంస్థకు చెందిన సర్వర్లలో కొన్ని భద్రతా లోపాలు ఉన్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. దీంతో విద్యార్థుల మార్కులు, వ్యక్తిగత డేటా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్ నిపుణుల కమిటీ సూచనల మేరకు బోర్డు ఈ తక్షణ చర్యలు చేపట్టింది. ఇకపై రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియ మొత్తం సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే జరగనుండటంతో డేటాపై బోర్డుకు పూర్తి నియంత్రణ, భద్రత ఉంటుందని ఐఐటీ కాన్పూర్ నిపుణులు స్పష్టం చేశారు.
పునఃసమీక్ష కోసం 1.6 లక్షల దరఖాస్తులు.. విద్యార్థులకు బోర్డు సూచనలు
ఫలితాల అనంతరం మార్కుల వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ కోసం విద్యార్థుల నుంచి భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. జూన్ 3న ప్రారంభమైన ఈ దరఖాస్తుల విండో జూన్ 7 అర్ధరాత్రితో ముగిసింది. ఈ ఐదు రోజుల్లోనే దాదాపు 1.6 లక్షల మంది విద్యార్థులు సుమారు 3.8 లక్షల జవాబు పత్రాల పునఃసమీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారని బోర్డు వెల్లడించింది.
అయితే, దరఖాస్తు చేసుకునే సమయంలో కొంతమంది విద్యార్థులకు ‘రోల్ నంబర్ నాట్ ఫౌండ్’ (Roll Number Not Found) అని రావడంపై సీబీఎస్‌ఈ స్పష్టత ఇచ్చింది. మొదటి దశలో స్కాన్డ్ కాపీల కోసం దరఖాస్తు చేసుకోని వారికి మాత్రమే అలా చూపిస్తుందని బోర్డు స్పష్టం చేసింది. సైబర్ దాడులను అడ్డుకుంటూ సాంకేతిక బృందాలు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని.. విద్యార్థులు ఎలాంటి సామాజిక మాధ్యమాల అవాస్తవాలను నమ్మకుండా, ఫలితాల సమాచారం కోసం కేవలం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఫాలో అవ్వాలని సీబీఎస్‌ఈ సూచించింది.









