నకిలీ పత్రాలను సృష్టించి అమెరికా బ్యాంకును దాదాపు 100 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.954.2 కోట్లు) మేర మోసం చేసిన భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజానీ (44) ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్ ప్రాంతంలో ఉన్న అతడి విలాసవంతమైన భవనంలో బుధవారం ఉదయం ఈ అరెస్ట్ జరిగింది. గ్రీన్ కార్డుపై అమెరికాలో నివాసముంటున్న మఖిజానీ, అక్కడ ‘కాంటర్ గ్రూప్ V LLC’ అనే సంస్థను నడుపుతున్నాడు. ఈ సంస్థకు సదరు బ్యాంకుతో ఉన్న రుణ ఒప్పందాలను ఆసరాగా చేసుకుని సెప్టెంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (IRS) దర్యాప్తు ప్రకారం.. మఖిజానీ టైటిల్ ఇన్సూరెన్స్ రికార్డులను తారుమారు చేసి, రియల్ ఎస్టేట్ ఆస్తులపై తన సంస్థకే యాజమాన్య హక్కులు ఉన్నట్లు నకిలీ పత్రాలను సృష్టించాడు. ఫెడరల్ ఇన్సూరెన్స్ ఉన్న బ్యాంకును బురిడీ కొట్టించడానికి షెల్ కంపెనీల నెట్‌వర్క్‌ను ఉపయోగించి భారీగా నిధులను కొల్లగొట్టాడు. ఈ కుట్రను ఛేదించిన ఐఆర్ఎస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం, వివిధ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలను నిశితంగా పరిశీలించి అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో కనుక ఆరోపణలు రుజువైతే మఖిజానీకి గరిష్ఠంగా 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
ఆర్థిక మోసాలతో పాటు మఖిజానీపై పలు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు కూడా ఉన్నాయి. బ్యాంకు సిబ్బందిని డ్రగ్స్, సెక్స్ వర్కర్లతో నిర్వహించే ప్రైవేట్ పార్టీలకు ఆహ్వానించి, అక్కడ జరిగిన తతంగాన్ని రహస్యంగా వీడియోలు తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే సాయుధ అనుచరుల సహాయంతో విలాసవంతమైన ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లను కబ్జా చేశాడని, తన కింద పనిచేసే సిబ్బందిని చంపేస్తానని బెదిరించాడని కోర్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా, గత నెలలోనే లగున బీచ్‌కు చెందిన మరో ప్రముఖ వ్యాపారవేత్తతో జరిగిన రియల్ ఎస్టేట్ వివాదంలో మఖిజానీ దాదాపు 1.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12,391.6 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలంటూ మధ్యవర్తిత్వ కమిటీ తీర్పునివ్వడం గమనార్హం.









