వైసీపీ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అక్రమ భూ ఉదంతాలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. స్పీకర్‌గా ఉన్నప్పుడు ఎన్నో నీతులు చెప్పిన తమ్మినేని, తెరవెనుక దారుణమైన అక్రమాలకు ఒడిగట్టారని మండిపడ్డారు. బతికి ఉన్న వ్యక్తిని సైతం చనిపోయినట్టు చిత్రీకరించి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు.
కూటమి ప్రభుత్వానికి రాజకీయ కక్షసాధింపులు చేసే సంస్కృతి లేదని, అయితే తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే చట్టప్రకారం కఠినంగా శిక్షించి తీరుతామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పరువు తీసిన ఇలాంటి నేతలను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వంటి వారు వెళ్లి పరామర్శించడం, వైఎస్ జగన్ వారిని సమర్థించడం సిగ్గుచేటని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్‌పై కూడా మంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు రైతు కండువాలు వేసి నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంలో సీఎం చంద్రబాబు సాధించిన ఢిల్లీ స్థాయి విజయాన్ని చూసి ఓర్వలేకే జగన్ సరికొత్త రాజకీయ డ్రామాలకు తెరలేపారని, కూటమి ప్రభుత్వం రైతుల ప్రతి సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.









