ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పార్లమెంట్ హౌస్‌లో జరిగిన ఈ భేటీలో, వచ్చే ఆగస్టు 1వ తేదీన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ (అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్) వేడుకకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ప్రధానిని చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మతో పాటు పలువురు కూటమి ఎంపీలు కూడా పాల్గొన్నారు.
ఈ మెగా ఈవెంట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం, ప్రారంభోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించింది. పురపాలక శాఖ ఉత్తర్వుల ప్రకారం.. కేతన్ గార్గ్, ధ్యాన చంద్ర, రాహుల్ మీనా, మయూర్ అశోక్‌లు ప్రజా అవసరాలు, పారిశుద్ధ్య వ్యవహారాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారు. వీరికి సహాయంగా 26 మంది నాన్-క్యాడర్ అధికారులు విజయనగరం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సమన్వయంతో పనిచేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో నిర్మితమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఒక మణిహారంగా నిలుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందాయో, అదే తరహాలో భోగాపురం పరిసరాలు కూడా పారిశ్రామికంగా, ఆర్థికంగా శరవేగంగా పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అందుకే ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సారాంశం.









