రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా ఈ నియోజకవర్గాన్ని భారీగా అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన సుమారు 3 వేల మంది లబ్ధిదారులకు ఆయన శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు తనకు అందించిన 91 వేల ఓట్ల భారీ మెజారిటీనే తనలో కొండంత బలాన్ని నింపిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.
మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీరు, భూగర్భ డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ. 1800 కోట్లతో భారీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే ఛాలెంజ్ ఫండ్, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ నిధులతో ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. వీటితో పాటు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, పైప్లైన్ గ్యాస్ సరఫరా మరియు నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను 12 నెలల్లో పూర్తి చేయడం వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ పథకం నిధుల జమ ప్రక్రియ ప్రారంభమైందని, అలాగే రూ. 4 వేల పింఛను, ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీలను కూడా దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు. స్థానిక ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో కేంద్రం నుండి నిధులు సులభంగా వస్తున్నాయని, 2019 ఓటమి తనకు నేర్పిన పాఠంతోనే ఐదేళ్లు ప్రజల మధ్య ఉండి వారి మనసులు గెలుచుకున్నానని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తుచేసుకున్నారు.









