‘హుషార్ పిట్టలు’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నటుడు పుట్టా భాను తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వేదికపై మాట్లాడుతున్న సమయంలోనే ఆయన అనూహ్యంగా తన చెంపలపై తానే గట్టిగా కొట్టుకోవడంతో అక్కడున్న చిత్రబృందం, మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా తన చర్యకు గల కారణాన్ని వివరిస్తూ భాను కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి అని, ఇప్పుడు తన నటనను వెండితెరపై చూసి ప్రేక్షకులు నవ్వుతుంటే అదంతా నిజమా లేక కలా అని నమ్మలేకపోయానని పేర్కొన్నారు. అది కల కాదని, నిజమేనని నిరూపించుకోవడానికే తనను తాను అలా కొట్టుకున్నానని భావోద్వేగంతో వెల్లడించారు.
గత ఎనిమిదేళ్లుగా సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నానని, ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే తన ఏకైక లక్ష్యమని ఆయన తెలిపారు. భాను అభిరుచిని, అంకితభావాన్ని మెచ్చుకున్న చిత్ర యూనిట్ సభ్యులు ఆయనను ఓదార్చారు. అన్ష్, వాసవి గణేశ్ జంటగా భిక్షు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘హుషార్ పిట్టలు’ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.









