హోర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామంటూ తరచూ ప్రకటనలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధికి సంబంధించిన మ్యాప్‌ను ట్రూత్ సోషల్‌లో పోస్టు చేసిన ఆయన.. ఆ ప్రాంతాన్ని అమెరికాలో కలిసిన కొత్త భూభాగంగా పేర్కొన్నారు. ఇరాన్‌తో ఎలాంటి చర్చలు, సంప్రదింపులు జరగడం లేదని, చర్చలకు ఎలాంటి షెడ్యూల్ కూడా లేదని స్పష్టం చేశారు. ఇరాన్ నౌకలపై దిగ్బంధం కొనసాగుతోందని, ఇతర దేశాల నౌకలకు మాత్రం జలసంధి తెరిచే ఉందని తెలిపారు.
మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో జరిగిన యుద్ధంలో, దౌత్యపరమైన పోరులో ఇరానే విజయం సాధించిందని, అమెరికా తమ షరతులకు తలొగ్గేలా చేయగలిగామని పేర్కొన్నారు. అమెరికా నౌకా దిగ్బంధాన్ని, ఇరాన్ చమురు విక్రయాలపై ఆంక్షలను ఎత్తివేసే వరకు హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఘలీబఫ్ స్పష్టం చేశారు. ట్రంప్ భ్రమల్లో ఉన్నారని, త్వరలోనే ఆ భ్రమలు తొలగిపోతాయని ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి ఘరిబాబాదీ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధిలో ఒమన్ తీరానికి సమీపంగా మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. గ్రీకు జెండాతో ప్రయాణిస్తున్న ఆ నౌక ఇంజన్ రూమ్‌లో మంటలు చెలరేగడంతో ఓ ఇంజనీర్ మృతి చెందగా, మిగతా సిబ్బందిని ఒమన్ తీరప్రాంత గస్తీదళం రక్షించింది. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. దీంతో హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.









