9 నెలల తర్వాత ఇమ్రాన్‌ ఖాన్‌కు కుటుంబ సభ్యుల భేటీ.. ఆస్పత్రికి తరలించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ ఖాన్‌ను దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆయన భార్య బుష్రా బీబీ, సోదరి నూరీన్‌ నియాజీ అదియాలా జైలులో కలిశారు. ఇటీవల ఇమ్రాన్‌ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు రావడంతో పీటీఐ ఆందోళనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇకపై కుటుంబ సభ్యులు వారానికి ఒకసారి ఇమ్రాన్‌ను కలుసుకునేందుకు, ఆయన కుమారులతో ఫోన్‌లో మాట్లాడేందుకు అవకాశం కల్పించనున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్‌ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్‌ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిపుణుల వైద్య బృందంతో పరీక్షలు నిర్వహించనుండగా, ఆయన వ్యక్తిగత వైద్యుడు ఫైసల్‌ సుల్తాన్‌ కూడా బోర్డులో ఉండనున్నారు. నూరీన్‌ సుమారు 15 నిమిషాలు ఇమ్రాన్‌తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారని, అనంతరం బుష్రా బీబీ 30 నుంచి 35 నిమిషాల పాటు ఆయనను కలిశారని పాక్‌ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉండగా, ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్య పరిస్థితిపై గతంలో ఆయన కుటుంబ సభ్యులు చేసిన కొన్ని ఆరోపణలను పాకిస్థాన్‌ ప్రభుత్వం ఖండించింది. ఈ ఏడాది ప్రారంభంలో కంటి సమస్యకు చికిత్స కోసం ఆయనను పలుమార్లు ఆస్పత్రికి తరలించారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను పీటీఐ స్వాగతించగా, ఇమ్రాన్‌ వైద్య చికిత్సకు సంబంధించిన ఆదేశాలపై ప్రభుత్వం సమీక్ష పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉందని న్యాయశాఖ మంత్రి అజమ్‌ నజీర్‌ తరార్‌ తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు