చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మోడ్రన్ మిస్సమ్మ’. సాయిబాబా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హర్ష నర్రా, తన్మయి ఖుషి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్రంలోని తొలి పాటను గ్రాండ్‌గా విడుదల చేశారు.
గోపీ సుందర్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కిట్టు విస్సప్రగడ సాహిత్యం అందించారు. ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ అంటూ సాగే ఈ పాటలో హీరో సంప్రదాయ పంచెకట్టులో, హీరోయిన్ తన్మయి ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. హీరోయిన్ పెళ్లి వద్దంటూ పాడుకునేలా రూపొందించిన ఈ పాట మహిళలకు కనెక్ట్ అయ్యే విధంగా ఉందని చిత్రబృందం తెలిపింది.
దర్శకుడు సాయిబాబా మాట్లాడుతూ ‘మిస్సమ్మ’ వంటి క్లాసిక్ టైటిల్ పెట్టాలంటే ధైర్యం కావాలని, గతంలో వచ్చిన ఎన్టీఆర్, భూమిక ‘మిస్సమ్మ’ చిత్రాలు ఎంతో అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయని చెప్పారు. తమ సినిమాలోనూ అలాంటి కొత్తదనం ఉందన్నారు. పెళ్లి వద్దని చెప్పడం తమ ఉద్దేశం కాదని, పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనని తెలిపారు. నిర్మాత చిరంజీవి పమిడి మాట్లాడుతూ ట్రెండ్‌కు తగ్గట్టుగా సినిమాను రూపొందించామని, అనుకున్న బడ్జెట్, సమయంలో చిత్రాన్ని పూర్తి చేయడం తమ తొలి విజయమని పేర్కొన్నారు.









