పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సొంతగడ్డపై వరుస సిరీస్‌లకు సిద్ధమైంది. శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు అక్టోబర్‌లో పాకిస్తాన్ పర్యటనకు రానున్నాయి. ఈ పర్యటనలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక మధ్య అక్టోబర్ 9 నుంచి 13 వరకు మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. మూడు మ్యాచ్‌లకు రావల్పిండి క్రికెట్ స్టేడియమే వేదికగా ఉండనుంది.
ఆ తర్వాత పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య అక్టోబర్ 18 నుంచి 31 వరకు వన్డే ట్రై-సిరీస్ నిర్వహించనున్నారు. రావల్పిండి, లాహోర్ వేదికల్లో జరిగే ఈ సిరీస్‌లో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అక్టోబర్ 31న లాహోర్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అనంతరం శ్రీలంక పాకిస్తాన్‌లోనే ఉండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
శ్రీలంకతో తొలి టెస్టు నవంబర్ 9 నుంచి 13 వరకు రావల్పిండిలో, రెండో టెస్టు నవంబర్ 17 నుంచి 21 వరకు లాహోర్‌లో జరగనుంది. అంతకుముందు నవంబర్ 4 నుంచి 6 వరకు ఇస్లామాబాద్‌లో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించనున్నారు. దాదాపు నెలన్నర పాటు సాగనున్న ఈ హోమ్ సీజన్‌తో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు వరుస మ్యాచ్‌ల సందడి నెలకొననుంది.









