తల్లికి వందనం: ఈ నెల 30న రూ.13 వేలు.. వీరికి మాత్రమే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంలో మరో విడత నిధులు ఈ నెల 30న జమ కానున్నాయి. ఒకటో తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌లో కొత్తగా చేరిన విద్యార్థులతో పాటు అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో గత విడతలో నగదు అందని వారికి ఈ విడతలో లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే ప్రభుత్వం మొదటి విడతలో లక్షలాది మంది విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి రూ.13 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేసింది.

గత విడతలో ఆధార్ సీడింగ్, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి సాంకేతిక సమస్యల కారణంగా డబ్బులు అందని అర్హులైన విద్యార్థుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హత ఉన్నవారు ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులైన వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డీబీటీ ద్వారా నగదు జమ చేయనున్నారు.

ఈ విడతలో సుమారు 2.78 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పథకం కింద ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు కేటాయిస్తుండగా, పాఠశాల నిర్వహణ కోసం రూ.2 వేలు మినహాయించి రూ.13 వేలు తల్లి ఖాతాలో జమ చేస్తోంది. దీంతో అర్హులైన విద్యార్థులు, వారి తల్లులు ఈ నెల 30న నగదు జమ అవుతుందా లేదా అనే విషయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share