రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధుల బృందానికి చేదు అనుభవం ఎదురైంది. ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా జైపూర్ జిల్లాలోని రాంపురా కన్వర్‌పురా గ్రామానికి వెళ్లిన సీజేపీ ప్రతినిధులను గ్రామంలోకి రావొద్దంటూ కొందరు స్థానికులు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రంకా నాయకత్వంలో ప్రతినిధుల బృందం శుక్రవారం గ్రామానికి చేరుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాలల నిర్వహణ పరిస్థితులను పరిశీలించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ ప్రతినిధులు తెలిపారు. అయితే బృందం గ్రామంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.
స్థానికులు ఎందుకు తమను అడ్డుకున్నారనే దానిపై పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ ఘటనతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు, పోలీసులు జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన కార్యక్రమానికి ఇలా అడ్డంకులు ఎదురుకావడంపై సీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.









