కేరళకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రత్యేక ఆయుర్వేద చికిత్స కోసం పయనం

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ శనివారం కేరళకు వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి రొటేటర్ కఫ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా కేరళలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ తీసుకోనున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఈ చికిత్స కొనసాగించనున్నట్లు జనసేన కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

శస్త్రచికిత్స అనంతరం వైద్యులు పవన్ కల్యాణ్‌కు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొంతకాలం బహిరంగ కార్యక్రమాలు, అధికారిక విధులకు దూరంగా ఉండాలని కూడా వైద్యులు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్ర పాలనా బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ ఎక్కువకాలం విశ్రాంతికి పరిమితం కాలేకపోయారు.

శస్త్రచికిత్స జరిగిన వారం రోజుల్లోనే ఆయన క్యాంపు కార్యాలయానికి అందుబాటులోకి వచ్చి పాలనా వ్యవహారాలను పర్యవేక్షించారు. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకోనున్న పవన్ కల్యాణ్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షించనుంది. చికిత్స పూర్తయ్యే వరకు విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share