మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలోకి అనుమతి లేకుండా ప్రవేశించడం, తరగతుల నిర్వహణకు అంతరాయం కలిగించడం, ఉపాధ్యాయులను బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
లాతూర్‌లోని ఔసా పోలీస్ స్టేషన్‌లో జవళి సమీపంలోని జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయురాలు సయ్యద్ షమ్షద్‌బానో ఖైరతాలీ (53) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ప్రకారం.. దీప్కే, ఆయన సహచరులు అనుమతి లేకుండా పాఠశాలలోకి వెళ్లి విద్యార్థుల మధ్య కూర్చొని వారిని ప్రశ్నించడంతో విద్యా, ప్రభుత్వ కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని ఆరోపించారు.
కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా దీప్కే లాతూర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, భద్రత, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై ఆయన సామాజిక ఆడిట్ నిర్వహిస్తున్నారు. అయితే పాఠశాల సందర్శన సమయంలో వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ఉపాధ్యాయులను సస్పెండ్ చేయిస్తానని బెదిరించడం వంటి ఆరోపణలు కూడా ఫిర్యాదులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.









