భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ త్రిషా జాలీ–గాయత్రి గోపీచంద్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ 2026లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌కు చేరుకోలేకపోయినప్పటికీ, ప్రపంచ నంబర్-1 జోడీతో హోరాహోరీగా పోరాడిన భారత జంటకు ఈ పతకం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. మహిళల డబుల్స్‌లో ప్రపంచ వేదికపై భారత్‌కు ఇది కీలక విజయంగా నిలిచింది.
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్‌లో త్రిషా–గాయత్రి జోడీ చైనాకు చెందిన ప్రపంచ నంబర్-1, డిఫెండింగ్ ఛాంపియన్లు లియు షెంగ్‌షు–టాన్ నింగ్‌ను ఢీకొంది. తొలి గేమ్‌లో భారత జోడీ అద్భుత ప్రదర్శన కనబరిచి 21-18తో విజయం సాధించింది. దీంతో మ్యాచ్‌పై ఉత్కంఠ మరింత పెరిగింది.
అయితే రెండో గేమ్‌లో చైనా జోడీ పుంజుకుని 21-13తో గెలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ లియు షెంగ్‌షు–టాన్ నింగ్ ఆధిపత్యం ప్రదర్శించి 21-8తో గెలుపొందారు. దీంతో సుమారు గంటా 11 నిమిషాల పాటు సాగిన పోరులో త్రిషా–గాయత్రి 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి చవిచూశారు. సెమీఫైనల్‌లో ఓడినా, కాంస్య పతకంతో భారత మహిళల డబుల్స్‌కు ఈ జోడీ అరుదైన ఘనతను అందించింది.









