ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో అమాయక పురుషులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న హనీ ట్రాప్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పరిచయం పెంచుకుని, అనంతరం బెదిరింపులకు పాల్పడుతూ బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసుకు సంబంధించి తాడితోటకు చెందిన నవీన, సత్యవతి, వెంకటలక్ష్మితో పాటు మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముందుగా బాధితులతో పరిచయం ఏర్పరచుకుని, ఆ తర్వాత వారిని తమ వలలోకి దింపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా కార్యకలాపాలపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో నగరంలో హనీ ట్రాప్ మోసాలపై మరోసారి చర్చ మొదలైంది. పరిచయం లేని వ్యక్తులతో ఆన్‌లైన్ లేదా వ్యక్తిగత సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.









