గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్- 19 కేజీల గంజాయి స్వాధీనం
*గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవు – భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్*
మాదకద్రవ్యాలపై ఉక్కు పాదం మోపాలంటూ భద్రాచలం డీఎస్పీ ఆదేశాలతో పట్టణ ఎస్సై వి. సతీష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఆదివారం రాత్రి భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులను చూసి అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో భాగంగా పోలీసులకు పట్టుబడిన నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజయ్ @ అజయ్ సైని, ఉజ్వల్ @ ఉజ్వల్ సైనిగా గుర్తించారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
మహమ్మద్ అష్రఫ్ ఖురేషి అనే వ్యక్తి రెండు ట్రాలీ లగేజ్ బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లను ఉంచి, బెంగళూరులోని సతీష్ అనే వ్యక్తికి అందజేయాలని సూచించినట్లు నిందితులు తెలిపారు. దీంతో వారు సుకుమ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకుని భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని, బెంగళూరు వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా పోలీసులు పట్టుబడ్డారు .
నిందితుల వద్ద నుంచి సుమారు 19 కేజీల గంజాయి, దీని విలువ సుమారు రూ.9,41,500/-, అలాగే రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
పట్టుబడిన ఇద్దరు నిందితులను భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, భద్రాచలం పట్టణ ఇన్‌స్పెక్టర్ యం. నాగరాజు కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా భద్రాచలం డీఎస్పీ మాట్లాడుతూ, యువత గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచి, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా అవగాహన కల్పించాలని కోరారు.
గంజాయి అక్రమ రవాణా, విక్రయం, నిల్వ, వినియోగానికి పాల్పడే వారితో పాటు అక్రమ రవాణాకు సహకరించే వ్యక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అక్రమ విక్రయం, రవాణా, నిల్వకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.









