గాజాలో శాంతిభద్రతల పరిరక్షణకు అంతర్జాతీయ స్థాయిలో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు కాల్పుల విరమణను అమలు చేసేందుకు ప్రతిపాదించిన ‘ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్’లో భాగస్వామ్యం కావడానికి ఆఫ్రికా దేశాలు ముందుకు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉగాండా, బురుండి దేశాలు తమ సైనిక బలగాలను గాజాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రతిపాదనపై ఆయా దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ అమలు, ప్రాంతీయ స్థిరత్వం కోసం ఈ బలగాలు కీలకంగా పనిచేసే అవకాశం ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో రూపొందిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ప్రణాళికలో భాగంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గాజాలో శాంతి, భద్రతలను పునరుద్ధరించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని పెంచడమే ఈ ప్రతిపాదన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే బలగాల మోహరింపు, వారి విధులు, ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.









