సింగరేణి మండలానికి సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇవ్వాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు
ఆగస్టు 24: TODAY 9 NEWS…
సింగరేణి మండలానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటిని అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి బాజు మల్లాయిగూడెం మాజీ సర్పంచ్, సీపీఎం సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ కరపటి రాములు 13వ వర్ధంతి సభను వజ్జా రామారావు అధ్యక్షతన నిర్వహించారు…
ఈ సందర్భంగా నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తయినా, రాష్ట్రాలు ఏర్పడి దశాబ్దాలు గడిచినా ఏజెన్సీ ప్రాంతంలోని సింగరేణి మండలానికి ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా చుక్క నీరు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్న గిరిజన, గిరిజనేతర పేదలు వర్షాధార సాగుపైనే ఆధారపడుతున్నారని తెలిపారు.
వర్షపు నీటితో నిండే చెరువులు, కుంటలు, బోర్లు, బావులు మినహా శాశ్వత నీటి వనరులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇది ఇలా ఉంటే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి మండలం పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు కాలువల కోసం సింగరేణి మండలంలోని మధ్యతరగతి, పేద రైతుల భూములను తీసుకుంటున్నప్పటికీ, 2013 భూ నిర్వాసితుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. సీతారామ కాలువలు సింగరేణి మండల భూముల మీదుగా వెళ్తున్నప్పటికీ స్థానిక రైతులకు సాగునీరు అందకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
సింగరేణి మండలానికి సాగునీరు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజలు ఎదుర్కొంటున్న విద్య, వైద్యం, భూ సమస్యల పరిష్కారానికి కరపటి రాములు ప్రజాప్రతినిధిగా, కమ్యూనిస్టు నాయకుడిగా అనేక పోరాటాలు నిర్వహించి ప్రజల మనసు గెలుచుకున్నారని నున్న నాగేశ్వరరావు కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యపరచి, ప్రజా సమస్యలపై పోరాడటమే కరపటి రాములుకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మెరుగు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే. నరేంద్ర, ప్రజానాట్యమండలి నాయకులు కరకపల్లి రాయమల్లు, మండల కమిటీ సభ్యులు సురభాగ ధనమ్మ, యనమనగండ్ల రవిబాబు, శాఖ కార్యదర్శి సూరబాక సర్వయ్య, సోషల్ మీడియా కన్వీనర్ ధరావత్ వినోద్ కుమార్, పార్టీ సభ్యులు షేర్ వెంకటేశ్వర్లు, బచ్చల బుజ్జమ్మ, బచ్చల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ కరపటి రంబాయమ్మ, భారత లక్ష్మి, బజ్జల వంశీకృష్ణ, ధరావత్ సరితతో పాటు కరపటి రాములు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









