దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ అయింది. ఎల్‌పీజీ ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువు ఆగస్టు 23తో ముగిసింది. ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు ఆగస్టు 24 నుంచి సిలిండర్ బుకింగ్, సబ్సిడీ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.
ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రధాన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేశాయి. తొలుత ఆగస్టు 16 వరకు గడువు ఉండగా.. అనంతరం మరో వారం రోజులు పొడిగించారు. అయితే ఆగస్టు 31 వరకు గడువును మరోసారి పెంచాలని వినియోగదారులు, డీలర్లు కోరుతున్నప్పటికీ ఇప్పటివరకు కంపెనీల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
దీంతో ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులు వెంటనే ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. గడువు పొడిగింపుపై స్పష్టత లేకపోవడంతో ఆలస్యం చేస్తే సిలిండర్ బుకింగ్ లేదా సబ్సిడీ పొందడంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే నిబంధనల అమలు, బుకింగ్ లేదా సబ్సిడీ నిలిపివేతపై ఆయా కంపెనీల తాజా అధికారిక ప్రకటనలను వినియోగదారులు తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.









