నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్‌కు అడుగులు పడ్డాయి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో భూసమీకరణ కోసం క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) నోటిఫికేషన్ జారీ చేసింది.
మోతడకలో మొత్తం 2,344.12 ఎకరాల భూమి ఉండగా.. ఇందులో 1,654.259 ఎకరాల పట్టా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించనున్నారు. మిగిలిన భూమి ప్రభుత్వానికి చెందినదని సీఆర్డీఏ తెలిపింది.
సమీకరించిన భూమిని ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణానికి వినియోగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అమరావతి భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో మోతడకలో తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కీలక రవాణా ప్రాజెక్టులకు అవసరమైన భూమి అందుబాటులోకి వస్తే అమరావతి మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది.









