నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,437 కోట్లు కేటాయించేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ఇప్పటికే మంజూరైన రూ.904 కోట్లకు అదనంగా మరో రూ.533 కోట్లు కేటాయించనున్నారు.
ఈ నిధులతో రాజధాని గ్రామాల్లో రహదారులు, ఇతర ప్రాథమిక మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్‌లో పెరగనున్న జనాభా, వాహనాల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన కొన్ని సీసీ రోడ్ల స్థానంలో బీటీ రోడ్లు నిర్మించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి కూడా ఆమోదం లభించింది. మరోవైపు శాకమూరులో సుమారు రూ.596 కోట్లతో సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, హెచ్ఆర్ భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి.
అలాగే రాజధాని ప్రాంతంలో హోటళ్లు, పాఠశాలలు వంటి సంస్థలకు అదనపు భూములు కేటాయించేందుకు కొత్త విధానం తీసుకురానున్నారు. ఇందులో భాగంగా ఎకరాకు కనీసం రూ.10.25 కోట్ల ధర నిర్ణయించే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.









