రెండేళ్లలో నేరిడి బ్యారేజీ పూర్తి చేస్తాం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక హామీ

శ్రీకాకుళం జిల్లాకు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నేరిడి బ్యారేజీ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి తీరతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నేరిడి ప్రాజెక్టు సమస్యను పరిష్కరించిందని తెలిపారు. మౌలిక వసతుల కల్పన, ప్రాంతీయ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. నేరిడి బ్యారేజీ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనను కేంద్ర మంత్రి కొనియాడారు. ఐటీ, వ్యవసాయం, సాంకేతిక రంగాల్లో ఆయన తీసుకొచ్చిన మార్పులతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. విజన్ స్వర్ణాంధ్ర 2047 దిశగా శ్రీకాకుళం ముందంజలో ఉందని, పేదరిక నిర్మూలనకు చేపట్టిన పీ4 విధానంలో జిల్లా ‘ఎ’ గ్రేడ్ సాధించిందని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి 16 వేల ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశారని గుర్తుచేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు