రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో త్వరలో అత్యంత వైభవంగా నిర్వహించతలపెట్టిన ‘జానపద జాతర’ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక శాసనసభ్యుడు కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. తెలంగాణ జానపద పరిశ్రమ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ సాంస్కృతిక మహోత్సవాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేటీఆర్‌ను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేసింది.
ఈ సందర్భంగా కేటీఆర్ కళాకారులతో ఆత్మీయంగా సంభాషించి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళారూపాలను సజీవంగా నిలబెట్టేందుకు వారు చేస్తున్న విశేష కృషిని కొనియాడారు. ప్రత్యేకించి తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో జానపద కళాకారులు తమ ఆటపాటలు, ప్రదర్శనలతో పల్లెపల్లెనా ప్రజలను చైతన్యవంతం చేయడంలో పోషించిన పాత్ర అద్వితీయమని గుర్తుచేశారు. ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన కళాకారుల సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల నుంచి విభిన్న కళారూపాల కళాకారులు తరలివచ్చి ఈ వేడుకలో తమ నైపుణ్యాలను ప్రదర్శించనుండటం ఎంతో గర్వకారణమని కేటీఆర్ అభినందించారు. తెలంగాణ గొప్ప జానపద వారసత్వాన్ని, సాంస్కృతిక వైభవాన్ని నేటి తరానికి చాటిచెప్పేలా నిర్వహించనున్న ఈ ‘జానపద జాతర’ విజయవంతం కావడానికి తనవంతుగా అన్ని విధాలా పూర్తి సహకారం అందిస్తానని నిర్వాహకులకు ఆయన భరోసా ఇచ్చారు.
Post Views: 5









