అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ప్రముఖ ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు 5:30 గంటల ప్రాంతంలో యూనిట్-15 ప్రొడక్షన్ బ్లాక్లో ఒక్కసారిగా దట్టమైన పొగలతో కూడిన భారీ మంటలు చెలరేగాయి. ఆ సమయంలో షిఫ్ట్ విధుల్లో ఉన్న కార్మికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు రక్షించుకునేందుకు బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శకటాలు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి సిబ్బంది బయటకు రావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అటు కంపెనీ యాజమాన్యం, ఇటు జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా ప్రొడక్షన్ బ్లాక్లో రసాయన చర్యల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తుండగా, ఖచ్చితమైన కారణాలపై అధికారులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి ప్రమాద తీవ్రతను, తాజా పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, అవసరమైన అన్ని సహాయక ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను హోంమంత్రి ఆదేశించారు. పరిశ్రమల్లో రక్షణ చర్యలు, భద్రతా ప్రమాణాలపై ఆడిట్ నిర్వహించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
Post Views: 4









