హైడ్రాపై ప్రత్యేక అవగాహన గీతం: రాంగోపాల్‌పేట సీఐ సురేశ్ కుమార్ గళం.. కమిషనర్ రంగనాథ్ పుట్టినరోజున పాట ఆవిష్కరణ!

పోలీసు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూనే, తనలోని సృజనాత్మక కళతో సమాజంలో చైతన్యం రగిలిస్తున్నారు రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బోడసింగి సురేశ్ కుమార్. హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుతో పాటు ‘హైడ్రా’ (HYDRA) రాకతో వచ్చిన సానుకూల మార్పులను కళ్లకు కడుతూ ఆయన స్వయంగా ఆలపించిన ప్రత్యేక అవగాహన గీతాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం ఘనంగా ఆవిష్కరించారు. కమిషనర్ రంగనాథ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన చేతుల మీదుగానే ఈ గీతాన్ని విడుదల చేయడం విశేషంగా నిలిచింది.
గతంలో హైదరాబాద్ నగరంలో కాలువలు, చెరువుల ఆక్రమణల వల్ల చిన్నపాటి వర్షానికే కాలనీలు ఎలా జలదిగ్బంధంలో చిక్కుకునేవి, ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రైనేజీ వ్యవస్థలు ఎలా మూసుకుపోయేవో ఈ పాటలో హృద్యంగా వివరించారు. హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత తీసుకున్న కఠిన చర్యలతో నగరం ఎలా వరద ముప్పు నుంచి బయటపడి సురక్షితంగా మారుతోందనే వాస్తవాలను సురేశ్ కుమార్ తన గాత్రంతో ఆకట్టుకునేలా వినిపించారు. ఈ పాటకు సురేశ్ కడారి అర్థవంతమైన సాహిత్యాన్ని అందించగా, కల్యాణ్ కీస్ స్వరపరిచిన బాణీలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఈ సందర్భంగా సీఐ సురేశ్ కుమార్ వినూత్న ప్రయత్నాన్ని కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఖాకీ దుస్తుల్లో విధులు నిర్వర్తిస్తూనే సంగీతం ద్వారా ప్రజా సమస్యలపై అవగాహన కల్పించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. గతంలో వినాయక చవితి ఉత్సవాల సమయంలో డీజే శబ్ద కాలుష్యంపై, అలాగే అంతకుముందు వలస కూలీల వ్యథలపై సురేశ్ కుమార్ పాడిన పాటలు విశేష ప్రజాదరణ పొందాయని రంగనాథ్ గుర్తుచేశారు. నగర సంక్షేమం, భద్రతను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పాట ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు